ఈ ముచ్చట మస్తుగుందిలే

Variety Story in Huzurabad

 

తెలంగాణలో ఓ ముచ్చట మస్తుగా నడుస్తున్నది. ఆ ముచ్చట కేసీఆర్, అమిత్ షా, ఈటల, రేవంత్ రెడ్డిల చుట్టూ తిరుగుతోంది. ముందుగాల అసలు ముచ్చటేందంటే ఈటల సారే గెలుస్తడని ..ఎవరో కాదు.. కేసీఆర్ సారే అనుకుంటున్నడంట. అల్లుడు హరీష్ రావును పెట్టి.. అధికారమంతా కుదువబెట్టి.. దళితబంధులాంటి పథకాలతో జనానికి ఊపిరాడకుండా చేసిన కేసీఆర్ సారుకే అనుమానంగా ఉందా? అదే అనుమానం ఇప్పుడు కొందరిని పట్టుకుంది.

ఈ ముచ్చట నిజమో కాదో మనకు తెలవదు గాని.. కేసీఆర్ సార్ అమిత్ షాను ఢిల్లీలో కలిసినప్పుడు చెప్పిండంట.. ఈటల గెలుస్తాడు.. కాని గెలిచినాక.. కాంగ్రెస్ లో కలుస్తడని.. అయితే కాని.. బిజెపికి ఈ గెలుపు .. కాంగ్రెస్ కు చెక్ పెట్టడానికి పనికొస్తదని అమిత్ షా అన్నడంట.

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంటే బిజెపి, టీఆర్ఎస్ కొట్లాట ఉత్తుత్తిదే అన్నమాట. మనిద్దరమే కొట్లాడుకోవాలా.. తిట్టుకోవాలా.. కాంగ్రెస్ ను ఆటలో అరటిపండు చేయాలన్నదే వారిద్దరి టార్గెట్ అని చెప్పుకుంటున్నరు. అందుకే బండి సంజయ్ కేసీఆర్, కేటీఆర్ లకు సవాళ్లు విసురుతారు.. కేటీఆర్, హరీష్ రావులు కేంద్రాన్ని, బిజెపిని తిట్టిపోస్తారు. కేసీఆర్ సారు అసెంబ్లీలో కేంద్రంపై విమర్శలు చేస్తారు.. కాని ఒక్కరు కూడా నరేంద్ర మోదీ, అమిత్ షాల పేరెత్తరు.. పల్లెత్తు మాటనరు.. ఇది జనం గమనించాలంటున్నారు కాంగ్రెసోళ్లు.

మరోవైపు ఈ ప్రచారాన్ని షురూ చేసింది రేవంత్ రెడ్డేనని గులాబీ పార్టీవోళ్లు అంటున్నరు. ఎందుకంటే కాంగ్రెస్ పోటీలో ఉన్నా లేనట్లేనని.. డమ్మీ క్యాండేట్ ని పెట్టారని.. రేవంత్ పరోక్షంగా ఈటలకే మద్దతిస్తున్నారని.. కాంగ్రెస్ అయి ఉండి బిజెపి క్యాండేట్ కి ఎలా మద్దతిస్తారనే సవాల్ వస్తది కనుకనే… ఈటల తర్వాత కాంగ్రెస్లోకి వచ్చేస్తారనే ప్రచారం చేసుకుంటున్నరని చెప్పుకుంటున్నరు. అంటే ఈటలను గెలిపించినా.. తప్పు కాదనే సిగ్నల్ రేవంత్ జనానికి ఇస్తున్నరని.. ఇదంతా తొండాట అని గులాబీ పార్టీవోళ్లు గుంజుకుంటున్నరు.

ఈటలొక్కడేనా.. వెంకటస్వామి కొడుకు వివేక్ కూడా కాంగ్రెస్లోకి వస్తడట. ఆయనేదో గిఫ్ట్లు అడిగిండంట.. రేవంత్ ఇస్తనన్నడంట.. గెలిచినా గెల్వకున్నా.. హుజూరాబాద్ ఎన్నికలైపోగానే.. ఈటల, వివేక్ ఇంకొందరు కాంగ్రెస్లోకి చేరతారంట. ఎందుకంటే టీఆర్ఎస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ జనానికి సమజవుతున్నదని.. రేపు కేసీఆర్ ని వ్యతిరేకించే జనం కాంగ్రెస్ వైపే చూస్తరని.. బిజెపిని అస్సలు దేకరని వాళ్లు ఫిక్సయ్యారంట. అందుకే ఈ డెసిషన్ అని చెప్పుకుంటున్నరు.

అసలుకే ఇప్పటికే ఈటలపై సింపతీ ఉందని.. గాయనే గెలుస్తడని చెప్పుకుంటున్నరు. మరోవైపు హరీష్ గల్లీ గల్లీ తిరుగుతున్నా.. ఎన్ని పథకాలు ఇచ్చినా.. ఎన్ని పైసలు కుమ్మరించినా.. జనం ఈటల వైపే చూస్తున్నరని అంటున్నరు. ఈ పథకాలు, పైసలు అన్నీ ఎన్నికల కోసమేనని వారంతా మూకుమ్మడిగా అనుకుంటున్నరంట. అందుకే కేసీఆర్ సార్ అమిత్ షాతో ఈటలే గెలుస్తడని చెప్పేసిండని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై గులాబీ మస్తు గుస్సవుతున్నది. పార్టీ ప్లీనం.. బహిరంగసభ.. హూజూరాబాద్ లో ఫైనల్ గా కేసీఆర్ స్పీచ్ ఇచ్చినంక.. గివేవీ నడవవని.. అందరూ గులాబీకే ఓట్లు గుద్దుతురని ధీమాగా చెప్పుకుంటున్నరు. మొత్తం మీద తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నడుస్తున్న హూజూరాబాద్ ఎన్నికలు.. రాజకీయ పార్టీల ఎత్తుగడలన్నీ చెరుకుగడల లెక్క బయటికొచ్చేస్తున్నాయి. గులాబీ, కమలం ఎపెయిర్ పెట్టుకున్నవని.. మరోవైపు రేవంత్, ఈటల ఎఫైర్ కూడా నడుస్తుందని చెప్పుకుంటున్నరు. ఇవన్నీ చూసి హూజూరాబాద్ ఓటర్లు ఏం సోచాయిస్తరో.. ఏం ఫైసలా తీసుకుంటరోనని రాజకీయ ఎనలిస్టులంతా ఇంట్రెస్టుగా ఎదురు చూస్తున్నరు. ఎవడూ తిన్నగా పాలిటిక్స్ చేసుడు లేదని కొందరైతే తిట్టుకుంటున్నరు.