కోహ్లీ వెనకడుగు… కానీ ఇప్పుడే కాదంట..!

Virat Kohli To Step As India's T20 Capitan after World Cup

 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త వెనుకడుగు వేశారు. ప్రస్తుతం ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ… ఇకపై కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం టెస్ట్, వన్డే, టీ20 ఫార్మెట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ టీ20 బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తర్వాత వచ్చే వారికి అప్పగిస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

రన్ మెషిన్‌గా పేరున్న విరాట్… దాదాపు రెండేళ్లుగా సరైన ఫామ్‌లో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే… ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఒకే రకమైన బంతులకు ఏకంగా 5 సార్లు అవుటయ్యాడు కోహ్లీ. ఏప్పుడో 2019 నవంబర్ నెలలో అది కూడా బంగ్లాదేశ్‌‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు విరాట్ బ్యాట్ నుంచి మరో శతకం నమోదు కాలేదు.

ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న విరాట్… ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు కూడా. ధోనీ తర్వాత మూడు ఫార్మెట్లకు కూడా విరాట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదేళ్లుగా టీమిండియాకు సారధ్యం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను సెమీ ఫైనల్ వరకు తీసుకెళ్లాడు కూడా. ధోనీ, గంగూలీ తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా కూడా విరాట్ గుర్తింపు పొందాడు. అటు సెంచరీల్లో ఇప్పటికే టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్‌లో ఉన్న విరాట్… టాప్ ప్లేస్‌పై కన్నేశాడని అంతా అనుకున్నారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేసిన వంద సెంచరీల రికార్డును కోహ్లీ మాత్రమే దాటగలడని అంతా అనుకున్నారు. కానీ గత రెండేళ్లుగా విరాట్‌ సరిగ్గా పరుగులు చేయడం లేదు. కొన్నిసార్లు క్రీజ్‌లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు కూడా. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న కోహ్లీ…. ఇకపై పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌పై, కెరీర్ పైనే దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించాడు. అయితే వచ్చే నెల 24వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ తప్పుకోనున్నాడు.