ప్రజా రవాణాపై వైరస్ ఎఫెక్ట్

Virus effect on public transport

 

కరోనా వైరస్…. ప్రజా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ ఎఫెక్ట్ ఇప్పటికీ ప్రజా రవాణా పై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పండుగలు వస్తున్నాయంటే ముందుగా అందరూ గ్రామాలకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటారు. కానీ కరోనా వైరస్ ఆ అవకాశం లేకుండా చేసింది. నిత్యం కోట్ల మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చే రైల్వే శాఖ ఇప్పుడు ప్రయాణికులు లేక సగం పైగా రైళ్లను ఆపేసింది. ఇక ఆర్టీసీ అయితే ఇప్పటికీ కొన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు ధైర్యం చేయడం లేదు.

సాధారణంగా దసరా, సంక్రాంతి పండుగలు వస్తున్నాయంటే పట్టణాల్లో నివసించే వలస పక్షులు నాలుగు రోజులు సొంత ఊర్లో బంధువులతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. 2020 మార్చి కి ముందు పరిస్థితి వేరు… ఇప్పుడున్న పరిస్థితి వేరు. సాధారణంగా రైల్వే శాఖ అన్ని రైళ్లలో రిజర్వేషన్ టికెట్లను 120 రోజులు ముందుగా ఆన్లైన్ లో ఉంచుతుంది. దసరా పండుగకు ఊరు వెళ్లాలనుకునే వాళ్ళు జూలై నెలలోనే టికెట్లు బుక్ చేసుకుంటారు. రద్దీ ఉండే మార్గంలో అన్ని రైల్వే టికెట్లు కూడా ఆగస్టు మొదటి వారానికి ఫుల్ అయిపోతాయి.

ముందస్తు రిజర్వేషన్ వల్ల రైల్వే శాఖ కూడా ఆదాయం. ముందుగానే రైల్వే ఖాతాలో డబ్బులు ఉండడంవల్ల దాదాపు 120 రోజుల వడ్డీ జమ అవుతుంది. ఇక ఆఖరి నిమిషంలో ప్రయాణం ప్లాన్ చేసుకున్న వారి నుంచి రెట్టింపు వసూలు చేస్తోంది రైల్వేశాఖ. రైలు బయలుదేరి ఒకరోజు ముందు తత్కాల్ పేరుతో అదనపు రుసుము వసూలు చేస్తున్న రైల్వే అధికారులు… కొన్ని రైళ్లకు డైనమిక్ ప్రైస్ పేరుతో విమాన ఛార్జి ని వసూలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ వల్ల చాలామంది ప్రజారవాణా వ్యవస్థను దూరంగా ఉంచారు.

మరో వారం రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. మామూలు రోజుల్లో అయితే ఈపాటికే అన్ని రైళ్లలో నో రూమ్ అనే బోర్డు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రధాన రైలు చాలా వరకు ఇంకా ఫుల్ అవ్వలేదు. గోదావరి, గౌతమి, పినాకిని, శాతవాహన, రత్నాచల్, జన్మభూమి రైళ్లలో టికెట్ దొరకడం గతంలో చాలా కష్టం. కానీ ఇప్పుడు ఈ రైళ్లన్నీ ఖాళీ సీట్ల తో నడుస్తున్నాయి.

ఇక ఆర్టీసీ సంగతి సరేసరి. 30 రోజులు ముందు ఫుల్ అయ్యే బస్సులు ఇప్పుడు ఖాళీ సీట్ల తో నడుస్తున్నాయి. గతంలో డబుల్ రేటు తో ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ అధికారులు… ఇప్పుడు ఉన్న బస్సులు ఫుల్ అయితే చాలు అనుకుంటున్నారు. కరోన వైరస్ కు భయపడి చాలామంది అంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారని..‌ దాని ప్రభావం ప్రజా రవాణాపై పడిందని అధికారులు వెల్లడించారు.