మీకు డయాబెటిస్ ఉందా? ఏ పండ్లు తినాలో ఐడియా ఉందా మరి..?

What is the best fruit for diabetics to eat

 

డయాబెటిస్ ఒక్కసారి మీ బాడీలోకి ఎంటర్ అయితే చాలు.. ఇక పొమ్మన్నా పోదు. ఏ చిన్న మిస్టేక్ చేస్తారా ఇంకా ఎంత బాగా ఎఫెక్ట్ చూపిద్దామా అన్నట్లు కాచుకుని కూర్చుంటుంది. అందుకే ఉన్నన్ని రోజులు డయాబెటిస్ తో సహవాసం చేస్తూ..మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తో పాటు కొన్ని ఆహారపుటలవాట్లలో మార్పు చేసుకుంటే మదుమేహం పూర్తిగా పోకపోయినా.. కంట్రోల్ లో ఉంటుంది. అయితే చాలా మంది తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.

కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. పండ్లు తినేందుకు వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని పండ్లను తినవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ బాధితులు తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవాళ్లు జీఐ తక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలగడంతో పాటు వాటిలో పొటాషియం, ఫైబర్‌తో పాటు పలు విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లతో మధుమేహుల్లో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్‌కు ఎలాంటి చేటు చేయవు. ఇక మధుమేహ బాధితులు పీచ్, చెర్రీ, ప్లమ్‌, యాపిల్‌, ఆరంజ్ వంటి పండ్లను తీసుకోవచ్చని వీటి జీఐ 45 కంటే తక్కువగా ఉండటం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ పండును డయాబెటిక్ పేషెంట్లు తినటం వల్ల ఇన్ ఫెక్షన్లను దూరంగా పెట్టవచ్చు. ద్రాక్షపండ్లు తినటం వల్ల రక్తప్రసరణ మెరుగవ్వటంతోపాటు, కొవ్వుశాతం తగ్గుతుంది.

దానిమ్మ పండును షుగర్ వ్యాధి ఉన్న వారు తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు స్వల్పంగా ఉంటాయి. నారింజ, నేరేడు , జామ, పైనాపిల్, అంజీర్ వంటి పండ్లను షుగర్ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. ఇలాంటి పండ్లను అధిక మోతాదులో కాకుండా, తరచూ తీసుకోవటం వల్ల చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుంది. మామిడిపండ్లు స్వీట్ నెస్ ఎక్కువ ఉన్న సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి.. ఆ సమయంలో రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే డయాబెటిక్ తో బాధపడేవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు.